బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ..ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా మౌనిక

బీజేపీ, బీఆర్ఎస్ దోస్తీ..ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ గా మౌనిక
  • వైస్ చైర్ పర్సన్ గా షోయబ్

ఖానాపూర్, వెలుగు: నిర్మల్​ జిల్లా ఖానాపూర్​ మున్సిపల్​ చైర్ పర్సన్, వైస్​ చైర్​పర్సన్​ ఎన్నికలో బీజేపీ, బీఆర్ఎస్​ ఒక్కటయ్యాయి. చైర్​పర్సన్​ పీఠాన్ని బీజేపీ, వైస్  చైర్ పర్సన్ పదవిని బీఆర్ఎస్  కైవసం చేసుకున్నాయి. ఆదివారం స్థానిక మున్సిపల్  ఆఫీస్​ మీటింగ్ హాల్ లో ఎన్నికల అధికారి, నిర్మల్  చీఫ్  ప్లానింగ్  ఆఫీసర్  జీవరత్నం, ఎన్నికల పర్యవేక్షకుడు, ఉట్నూర్  ఐటీడీవో పీవో యువరాజ్  మర్మత్  ఆధ్వర్యంలో ఎన్నిక జరిగింది. చైర్ పర్సన్ గా బీజేపీ నుంచి అంకం మౌనిక, కాంగ్రెస్  నుంచి చిన్నం సత్యనారాయణ నామినేషన్లు వేశారు.

అంకం మౌనికను బీజేపీ కౌన్సిలర్  బొప్పారపు సత్యవతి ప్రతిపాదించగా, బీఆర్ఎస్  కౌన్సిలర్  రాజగంగన్న బలపరిచారు. అలాగే చిన్నం సత్యనారాయణను కాంగ్రెస్  కౌన్సిలర్  నిమ్మల రమేశ్ ప్రతిపాదించగా, గొర్రె తిరుమల మద్దతు పలికారు. దీంతో అధికారులు ఎన్నిక నిర్వహించగా అంకం మౌనికకు అనుకూలంగా బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిలర్లు చేతులెత్తారు.

కాంగ్రెస్ కు చెందిన చిన్నం సత్యనారాయణ కు ఎక్స్  అఫీషియా సభ్యుడు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తో పాటు ముగ్గురు కాంగ్రెస్  కౌన్సిలర్లు, ఒక ఇండిపెండెంట్, ఒక బీఆర్ఎస్  కౌన్సిలర్  మద్దతు పలికారు. ఏడుగురు సభ్యుల మద్దతు ఇవ్వడంతో అంకం మౌనిక చైర్​పర్సన్ గా ఎన్ని కైనట్లు అధికారులు ప్రకటించారు.  వైస్  చైర్ పర్సన్ గా బీఆర్ఎస్ కు చెందిన 6వ వార్డు కౌన్సిలర్  షోయబ్ హుస్సేన్ , కాంగ్రెస్  నుంచి  ఇండిపెండెంట్  కౌన్సిలర్  సాజిదా బేగం నామినేషన్  దాఖలు చేశారు. షోయబ్  హుస్సేన్ కు ఏడుగురు సభ్యులు మద్దతు పలికారు. అనంతరం వారికి ఎన్నికల అధికారి ధ్రువప్రతాలను అందజేశారు.

బీజేపీ, బీఆర్ఎస్  పొత్తు..

ఖానాపూర్  మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్  చైర్ పర్సన్  ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్  ఏకమయ్యాయి. ఖానాపూర్  మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా బీఆర్ఎస్  నుంచి నలుగురు, బీజేపీ నుంచి నలుగురు, కాంగ్రెస్  నుంచి ముగ్గురు గెలవగా, ఒక ఇండిపెండెంట్  అభ్యర్థి గెలుపొందారు. దీంతో మ్యాజిక్  ఫిగర్  కోసం బీఆర్ఎస్, బీజేపీ పొత్తు కుదుర్చుకున్నాయి.

ఆదివారం మున్సిపల్ చైర్​పర్సన్,  వైస్  చైర్​పర్సన్  ఎన్నిక సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్మల్  ఎస్పీ డాక్టర్  జానకీ షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 420 మంది పోలీసు సిబ్బందితో పాటు ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, సీఐలు, ఎస్సైలు బందోబస్తులో పాల్గొన్నారు. మున్సిపల్  ఆఫీస్​ వద్దకు ఎవరూ రాకుండా చర్యలు తీసుకున్నారు.